Sunday, September 24, 2023

జీవన సంఘర్షణల కడుపాత్రం కథలు -ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి

 

    తవ్వా ఓబుల్‌ రెడ్డి జీవనప్రస్థానం ముచ్చట గొలుపుతుంది. ఆశ్చర్యచకితుల్ని కూడా చేస్తుంది. అతని చదువు సంధ్యలు, వృత్తివ్యాపకాలు, పల్లెపట్టున, చిన్నపట్టణాల జీవితం - అనుభవాలు, ఆకాంక్షలు, అభిరుచులు, జిజ్ఞాస, అధ్యయనం, పరిశీలనాసక్తులు, కార్యాచరణదృష్టి, బహుముఖమైనవి. దాదాపు దశాబ్దానికి పైగా పాత్రికేయవృత్తి, ఆ తర్వాత అదే స్వచ్ఛంద వ్యాపకం. తన చుట్టూ ఉన్న జీవితాన్ని నిశితంగా పరిశీలించే అవకాశం అతనికి కలిగించింది. అలాగే 15 ఏళ్లకు పైగా మారుమూల గ్రామీణ దళితవాడల్లోని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసిన అనుభవం.. దళితుల జీవితాలను ముఖ్యంగా వారి పిల్లలను నిశితంగా పరిశీలించే అవకాశం కలిగించింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ జీవితాలను సహానుభూతితో అర్థం చేసుకునే ప్రజాస్వామిక సంస్కారం అతనికి లభించింది. ఇవన్నీ అతని సాహిత్యసృజనకు తోడ్పడ్డాయి.


                చరిత్ర, పురాతత్వ విజ్ఞానం అతన్ని ఒక అన్వేషకుడిగా తీర్చిదిద్దాయి. కొన్ని శాసనాల ఆవిష్కరణకు దోహదపడ్డాయి. భిన్నకాలాల, భిన్నపాలకుల శాసనాలను, ఆలయాల నిర్మాణాలను, మెకంజీ కైఫీయత్తులతో సరిపోల్చి చూసుకుని ప్రజలకు పరిచయం చేసే అతని ఆసక్తినీ, ఆవిష్కరణల పట్ల అనురక్తినీ వచన రచయితలందరూ దగ్గరగా అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

                తెలుగు భాషాభివృద్ధి పట్ల తవ్వా ఓబుల్‌ రెడ్డికి ఉన్న నిబద్ధత అపురూపమైనది. కడప జిల్లా మైదుకూరు లోని ఒక మిషనరీ ఆంగ్లమాధ్యమ స్కూలులో 2009 లో తరగతి గదిలో తెలుగులో మాట్లాడటం నేరంగా పరిగణిస్తూ ఇద్దరు విద్యార్థులను మెడలకు బోర్డులు వేలాడదీసి శిక్షించడం తెలుగువారందరికీ తెలిసిన ఉదంతమే. ఈ సంఘటనలో తెలుగు భాషోద్యమ సమాఖ్య బాధ్యుడిగా తవ్వా ఓబుల్‌ రెడ్డి నడిపిన ఉద్యమం చారిత్రాత్మకమైనది. ఆ సందర్భంలో వెల్లువెత్తిన స్పందనపై 'తెలుగు పౌరుషం' అనే వ్యాస సంకలనాన్ని కూడా వెలువరించి హైదరాబాదులో 2018లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశాడు. ఒక జర్నలిస్ట్‌గా మైదుకూరు ప్రాంతంలో జరిగిన అనేక రైతు ఉద్యమాలతో ఓబుల్‌ రెడ్డికి సాన్నిహిత్యం ఉంది. రైతు ఉద్యమ నాయకులతో అతనికి ఉన్న పరిచయాలు, గ్రామీణ రైతు జీవితాలతో పెనవేసుకున్న మనస్తత్వం- ఇవన్నీ తవ్వా ఓబుల్‌ రెడ్డి జీవనసందర్భాన్ని, రచనాసందర్భాన్నీ నిర్ణయించాయని అనుకుంటాను.

                ఇక తవ్వా ఓబుల్‌ రెడ్డి కథాసాహిత్య సృజన విషయానికి వస్తే.. కథానికా రచన ఒక సంక్లిష్ట సృజనాత్మక ప్రక్రియ. రచయిత జీవన ఘర్షణతో, తత్వంతో ముడిపడిన సామాజిక ప్రక్రియ. ఈ సంక్లిష్టత, జీవన ఘర్షణ ఓబుల్‌ రెడ్డి కథల్లో అనేక అంశాల్ని సృజించింది. తవ్వా ఓబుల్‌ రెడ్డి 1998 లో తన తొలికథ 'స్మృతిపథం' తో  కథారచనను ప్రారంభించారు.

                అదే సంవత్సరంలో 'అత్యాచారం', 1999 లో 'సాయం' అనే కథలు ప్రచురితం అయ్యాయి. అయితే స్మృతిపథం ఈ సంపుటిలో లేదు. ఆ తర్వాత ఏడాదికి ఒకటో, రెండో కథలను మాత్రమే రాసుకుంటూ వచ్చాడు. ఒక 2006 వ సంవత్సరంలో మాత్రం ఐదు కథలు ప్రచురితం కావడం విశేషం. ఇప్పటిదాకా ఇరవై కథల్ని రాశాడు. ఏమైనా తవ్వా ఓబుల్‌ రెడ్డి విస్తారంగా రాయాలనుకునే రచయిత కాదు. కుదురుగా - ఏర్పడవలసిన కథాశిల్పం మీద, కథలోని పాత్రల జీవిత చిత్రణ మీద శ్రద్ధ చూపడం వల్లనే తక్కువగా రాశాడనిపిస్తుంది.

                ఈ సంపుటిలోని కథల్లో రచయిత తడిమిన జీవన సంఘర్షణలు ఈ కింది అంశాలకు సంబంధించినవిగా పేర్కొనవచ్చు.

1.            ప్రపంచ వ్యాప్తంగా ముసురుకోస్తున్న పర్యావరణ సంక్షోభం, మండేఎండలు, తుపాన్లు, వట్టికరువులు, పచ్చికరువులు, జలసంక్షోభం. బడుగురైతుల, ఇతర వ్యవసాయాధారిత వృత్తులవారి వలసలు.

2.            పంటలసాగు, దిగుబడి, అటు మెట్టభూముల్లో, ఇటు కాలవల కింది భూముల్లో, బోర్లకింద, ప్రాజెక్టుల కింద వ్యవసాయ సాగులో వచ్చిన ఎగుడు దిగుడు మార్పులు.

3.            రైతులు పండించిన పంటలకు గిట్టుబాటుకాని, నిలకడలేని ధరలు. 'గూనికి తోడు దొబ్బుడు వాయువు' అన్నట్లు ధరలను తమ చేతుల్లో పెట్టుకున్న దళారీ వ్యవస్థ.

4.            అభివృద్ధి గతమైన మార్పులు తెచ్చిన ప్రజావ్యతిరేక చర్యలు.

5.            తోలుబొమ్మలాట లాంటి జానపద కళలకు క్రమక్రమంగా ఎదురవుతున్న నిరాదరణ, తోలుబొమ్మలాటలకు ఉన్న వారసత్వంలోని విశేషాలు. సాంస్కృతిక వారసత్వం, పండుగలు పబ్బాల సందర్భాల్లో కొనసాగుతున్న కళారూపాలు, వాటిలో చోటు చేసుకుంటున్న మార్పులు. ముఖంగా ఆయా సందర్భాల్లో పల్లెలకు వచ్చి వినోదాన్నీ, విజ్ఞానాన్నీ కలిగించే వృత్తికళల విధ్వంసం, ఈ మార్పులకు వేగంగా తోడైన వినోద సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు, ఫలితంగా జరిగిన సాంస్కృతిక విధ్వంసం.

6.            రచయితకు జీవిస్తున్న, పనిచేస్తున్న ప్రాంతంలో నెలకొన్న శిధిల జీవనం, దాని చిత్రణ.

                పైన పేర్కొన్న అంశాలను స్పృశిస్తూ ఓబుల్‌ రెడ్డి రాసిన ఈ సంపుటిలోని కథలు పాఠకుల్ని ఆలోచనా తరంగాల్లోకి నెట్టుతాయి. కులపురాణాలు, మౌఖిక గాథలు వాటిని కథల్లో అంతర్భాగంగా రచయిత నేర్పుగా ఉపయోగించుకున్నాడు. తద్వారా మరుగున పడిన అంతర్లీనంగా ఉన్న చారిత్రక విశేషాంశాలను కూడా అధ్యయనం చేయాలనే స్పృహ కలుగుతుంది. అవి పిచ్చిగుంట్ల కథనాలు కావచ్చు, ఇతర కులగాథలు కావచ్చు.

                రాయలసీమ కథలంటే కరువుకథలని మొన్నమొన్నటి వరకూ వాపోయిన విమర్శకులున్నారు. ఈ బుద్ధిజాడ్యజనితోన్మాదక విమర్శకులు ఒక్కమారు గుంటూరు జిల్లాలోనూ, తెలంగాణాలోనూ పత్తిరైతుల వేదనను చిత్రించిన పాపినేని శివశంకర్‌, ముదిగంటి సుజాతారెడ్డి వంటి సాహితీకారుల కథలను చదివైనా తమ వైఖరిని మార్చుకుంటే సంతోషం. జీవిత మూలాలను స్పృశించని ఏ రచయితగానీ, రచనాకాలంగానీ, రచనా సందర్భంగానీ జీవితానికి నయా పైసంత తోడ్పడలేదు.

                ఈ కథాసంపుటిలోని ఓబుల్‌ రెడ్డి కథలన్నింటినీ పరిచయం చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, ఆ ఆసక్తిని నేను నియంత్రించుకోవడానికి కారణం.. పాఠకుల పఠనాసక్తి, పరిశీలన అధ్యయనాలమీద ఉన్న గౌరవమే.

                ఈ కథలు మనలో అనుభూతిని పెంచుతాయి. మన సామూహిక వేదనను తీవ్రతరం చేసి సామాజిక పరివర్తన, పరిశీలనకు తోడ్పడతాయి. కథల్లో ప్రయోగించిన మాండలిక నుడికారాలు, సామెతలు కూడా... ఉదాహరణకు 'ఎండగుర్రాలు ఎగిసిపడుతూ వడగాడ్పులు విసిరికొట్టే ఎడారి ప్రాంతంలో సెలయేరు లాంటి కాలువలు' అనే వాక్య ప్రయోగం. అలాగే గడ్డం గీయడమనేది సున్నిత వ్యవహారం. అందునా ఒక ఫ్యాక్షనిస్ట్‌ కు గడ్డం గీయాలంటే.. విజయరాఘవరెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్‌. ఒక ఫ్యాక్షనిస్ట్‌ దగ్గర పనిబాటలవాళ్ళు తలలో నాలుకలా మెదులుతూ తన భావాలను ఎలా మనసులో అనుకుంటారో 'నవవసంతం' కథలోని గంగులయ్య అనే మంగలి పాత్ర ద్వారా తెలుసుకోవచ్చు. 'ఖూనీలు చేయించే మనిషికి గడ్డం గీయడం అంటే మాటలా!' అనుకుంటాడు గంగులయ్య. ఈ కథలోనే 'వానకు తడవని వాళ్ళూ.. వసంతాలలో మునగని వాళ్ళూ దరిద్రులంట' అనే సామెతను రచయిత చాకలి రామన్న పాత్రద్వారా పలికిస్తాడు. చేతిలో అధికారం ఉన్నవాడి చుట్టూ జనం ఉంటారు. 'సాయం' కథలో ఎమ్మెల్యే సూర్యమోహన్‌ రెడ్డిని గురించి లచ్చుమయ్య తన మనసులో 'చేతిలో బెల్లం ఉంటేనే కదా ఈగలు ముసిరేది' అని అనుకుంటాడు. ఈ ప్రయోగాలు రచయితకు గ్రామీణ సామెతలపై ఉన్న పరిజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తాయి.

                'ఇనుపగజ్జెల సవ్వడి' కథలోని 'వానపడక పోయినా కరువే.. తుపాను వచ్చినా కరువే'. 'ఎక్కడో తుపాను వచ్చే గాని ఈడ వానలు పడిచావవు' అనే భావనలద్వారా.. రాయలసీమ రైతు ఆవేదన చెందే సందర్భాలు పాఠకులను తప్పకుండా ఆలోచింపజేస్తాయి.

                ఎండ, గాలి, వెన్నెల లాంటి ప్రాకృతిక కాలధర్మాలు ఎప్పటికీ గతి తప్పడం లేదు. వానల విషయంలో మాత్రం ప్రకృతి ఋతుధర్మం తప్పుతోంది. ఇలా ఎందుకు జరుగుతోందనే అనుమానాన్ని ' ఆకాశం నవ్వింది' కథలో బాలసుబ్బయ్య అనే బడుగు రైతు అమాయకంగా వ్యక్తం చేసిన సందర్భం సీమ రైతు తాత్విక మనోభావాలకు దర్పణం పడుతుంది. గ్రామీణ పిల్లలు రాత్రి సమయాల్లో వెన్నెల్లో ఆడుకునే ఆటలు, పాడుకునే పాటలకు సంబంధించిన పదాలు కొంత ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకంగా పరిమితమై ఉంటాయి. రిజర్వాయిర్‌ నిర్మాణం వల్ల ఆ పరిమిత ప్రాంతం ముంపునకు గురైనప్పుడు అక్కడి మానవ సమూహాలు చెల్లాచెదురు కావడం వల్ల అక్కడి మౌఖిక జానపద, క్రీడా బాల సాహిత్యం సైతం కనుమరుగై పోతుందనే సత్యం 'ముంపుకథ ద్వారా మనకు అవగతమవుతుంది.

                గతకాలంలో పల్లెజనులు పగలంతా కష్టం చేసుకుని పోద్దుగుంకే వేళ ఇళ్ళకు చేరుకొని తిండి వండుకుని, తిని, దీపం ఆర్పి తొందరగా పడుకునేవారు. శ్రమ వల్ల అలసిపోవడం ఒక కారణమైతే, దీపానికి చమురు ఆదా చేసుకోవడం మరో ఉద్దేశం. ఊరబడి కథలో ఒకప్పటి ఈ పరిస్థితిపై 'నోట్లో ముద్ద పడగానే గూట్లో దియ్యను మలిపి కునుకు తీసే రోజులు ఎప్పుడో పోయాయి' అని రచయిత వ్యాఖ్యానిస్తాడు.

                అలాగే 'బుడుక్కుతినేటోల్లు' కథలో ఎండాకాలం పొద్దున్నే ఎండ తీవ్రతను వర్ణిస్తూ ' ఉదయం పదిగంటలకే కనుగుడ్లు కందిపోయేట్లుగా ఎండ తీక్షణంగా కాస్తోంది అంటాడు రచయిత. అదే కథలో ఒక చెట్టును వర్ణిస్తూ ' ఆకులు రాలి దిగంబరంగా మారిన సుంకేసులచెట్టు ఎదో మాయావృక్షంలా గోచరిస్తోంది' అని రాస్తాడు. అదే కథలో రాయప్ప అనే దళితుడు కరువు కాలంలో తమ పరిస్థితిని చెబుతూ 'అల్లాడి ఆకులు మేచ్చాండం' అంటాడు. ఇలాంటి సామెతలు, జాతీయాలు, మాండలిక పదాల ప్రయోగం ఈ కథా సంపుటికి నిండుదనాన్ని చేకూర్చిందని కూడా చెప్పవచ్చు. రచయిత జీవితంలో భాగమైన వంకలు, వాగులు, కొండలు, గుట్టలు, మిట్టలు, పంటలు, పైర్లు వంటి ప్రత్యేక పదాలు కూడా ఈ కథల్లో మనకు కనిపిస్తాయి. ఈ పదాలు మన భాషాసంపదకు ప్రతిరూపాలు. ఒకటి రెండు ఉదాహరణలు కావాలంటే.. కేరింత, బుడుక్కుతినేటోళ్ళు, సియ్యలపండగ, సూతకం, ముంపు, వైరుధ్యం, ఊరబడి వంటి కథల్ని పరిశీలనగా చదవండి. అలాగే అత్యాచారం, కడుపాత్రం, ఉచ్చు, తొలిగుడిసె, ఇనుపగజ్జెల సవ్వడి, ఆకాశం నవ్వింది తదితర కథల్ని నెమరువేసుకుంటూ చదవండి. రాయలసీమ రచయితల కథానికా రచనాశక్తి ఎంతెంత విస్తృతంగా సాగుతూ పోతూ ఉందో గమనిస్తూ చదవండి. చాలా మంది రచయితలకు సామాజిక, మానవవిజ్ఞానశాస్త్ర దృక్కోణాలు తక్కువగా ఉన్న సందర్భంలో తవ్వా ఓబుల్‌ రెడ్డి కథలు ఆలోటును తీరుస్తాయి.

                'పర్యావరణ సాహిత్యం', 'వాతావరణ సంక్షోభ సాహిత్యం' (Climate Fiction) అనే మాటల్ని ఇప్పటి సాహితీ విమర్శకులు తరచూ వాడుతున్నారు. ఈ కోవలోకి వచ్చేవే ఈసంపుటిలోని చాలా కథలు కూడా.

(తాజాగా వెలువడిన కడుపాత్రం మరో పద్దెనిమిది కథలు - తవ్వా ఓబుల్ రెడ్డి కథాసంపుటి కి ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి  రాసిన ముందు మాట)

 

- కేతు విశ్వనాథ రెడ్డి,

కథా రచయిత,

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత.